చక్రి… గుర్తు చేసుకుందాము..

ఊరవతల షెడ్ లో కూర్చొని ఏవేవో వాయిద్యాలు వాయించుకుంటూ ఉంటే ఊళ్లో వారందరూ అతనికి ఏదో అయ్యింది అనుకునేవారు. ఎవరు ఎలా అనుకుంటేనే.. తను అనుకున్నది సాధించాడు. సంగీత దర్శకుడు అయి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అతనే… చక్రి అలియాస్ చక్రధర్. అనతికాలంలోనే సంచలనం సృష్టించిన సంగీత దర్శకుల్లో చక్రి ఒకరు. చక్రి గురించి క్లుప్తంగా మీ కోసం….

చక్రి జూన్ 15, 1974న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే మక్కువ ఎక్కువ. ఎక్కడైనా పాట వినబడితే.. అలా నుంచోని వినేవాడు. పాటలంటే అంత పిచ్చి. అయితే…ఒకానొక దశలో సంగీతం పై ఉన్న పిచ్చిని పక్కన పెట్టి గార్మెంట్ బిజినెస్ చేద్దామని హైదరాబాద్ కు రావడం.. అక్కడో మిత్రుడు తగిలి జాబ్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లడం రెండూ జరిగాయి. అయితే అక్కడ ఫ్లాట్ లు అమ్మే ఉద్యోగం చేయమడనం నచ్చక బయటికి వచ్చేసాడు. డిగ్రీ పూర్తైనా ఉద్యోగం లేదనే బాధ ఒక వైపు ఇష్టమైన రంగం పై మమకారం తెంచుకోలేక మరో వైపు ఊగిసలాడుతూనే ఓ నలభై ప్రైవేటు ఆల్బమ్స్ విడుదల చేసి చరిత్ర సృష్టించారు.

దీంతో అతనిలో ఉన్న టాలెంట్ తెలిసి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా బాచి సినిమాతో సంగీత దర్శకుడుగా చక్రి తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో పనైపోయిందని తనలో తను అనుకుంటుంటే అదృష్టం తలుపుతట్టింది. సత్యదేవ్ అనే మిత్రుడు పూరి జగన్నాథ్ కు పరిచయం చేసారు. కొత్తదనమేదో చక్రిలో కనిపించడంతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో చక్రి దశ తిరిగింది. మల్లికూయవే గువ్వా అంటూ సాగిన పాటల ప్రవాహం అలా సాగింది.

పూరి జగన్నాథ్ సినిమా అంటే సంగీత దర్శకుడు చక్రినే అనేంతగా వీరిద్దరి ప్రయాణం సాగింది. సత్యం, శివమణి, దేశముదురు, జౌను వాళళ్లిద్దరూ ఇష్టపడ్డారు, దేవదాసు, నేనింతే, గోపీ గోపికా గోదావరి… ఇలా ఎన్నో ఎన్నెన్నో సినిమాలకు సంగీతం అందించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. అయితే…ఇంకా ఎన్నో పాటలు అందిస్తాడు అనుకుంటే… ఊహించని విధంగా తక్కువ వయసులోనే తరలిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చక్రి భౌతికంగా లేకపోయినా.. పాటల రూపంలో ఎప్పుడూ బతికే ఉంటారు.

– వి. శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *