అప్పుడు పవన్ – ఇప్పుడు చరణ్‌..!

అప్పుడు జల్సాలో పవన్ – ఇప్పుడు ఆచార్యలో చరణ్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాల్లో జల్సా ఒకటి. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పవన్ కెరీర్ లో ఎందుకు స్పెషల్ అంటే… ఖుషి సినిమా తర్వాత ఏడేళ్ల వరకూ వరుస ఫ్లాపులతో అభిమానులను నిరాశపరుస్తున్న పవన్ కు హిట్ అందించిందిన సినిమా జల్సా. మొదటివారంలోనే వరల్డ్ వైడ్ గా 23కోట్లు వసూలు చేసి అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, కామెడీ, టేకింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలో పవన్ స్టైల్ యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయింది.
ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పవన్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది. వ్యవస్థ పై కోపంతో తిరుగుబాటు చేసే నక్సలైట్ పాత్రను తనకిష్టమైన చెగువేరా గెటప్ లో పవన్ కనిపించి ఆకట్టుకున్నాడు. అప్పట్లోనే 1000 స్క్రీన్స్ లో విడుదలైన జల్సా శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్‌ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇలియానా హీరోయిన్ గా నటించింది. పవన్ – ఇలియానా మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు, బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. పవన్ కు సరైన టైమ్ లో సరైన సక్సస్ అందించిన జల్సా పవన్ తో పాటు అభిమానులకు ఎప్పటికీ స్పెషలే.
ఇదిలా ఉంటే… తెలుగు సినిమాల్లో విప్లవాత్మక పాత్రలు చేసే హీరో అంటే ఠక్కున గుర్తుకువచ్చేది పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి. ఆయన ఎర్ర సైన్యం, ఎర్రోడు, ఓరేయ్ రిక్షా, చీమలదండు.. ఇలా ఎన్నో విప్లవాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఎన్ కౌంటర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అడవిలో అన్న.. ఇలా అప్పుడప్పుడు విప్లవాత్మక చిత్రాల్లో నటించారు. ఈతరంలో అలా.. విప్లవాత్మక భావాలతో సినిమాల్లో నటించడం అంటే.. పవన్ కళ్యాణ్ గుర్తుకువస్తారు. ఆయనకు అవకాశం కుదిరినప్పుడల్లా తన భావాలను తెర పై చూపించాలనుకుంటారు. జల్సా సినిమాలో నేను నక్సలైట్ ను అంటూ ఆవేశంగా చెప్పిన డైలాగులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్‌ జల్సాలో పోషించినట్టుగా.. అబ్బాయ్ రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నక్సలైట్ పాత్రను పోషిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది. రామ్ చరణ్‌ చెప్పే డైలాగులు ప్రజల్ని ఆలోచింప చేసేలా ఉంటాయని తెలిసింది. చిరంజీవి – చరణ్ కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని కొరటాల చెప్పారు. చరణ్‌ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్‌ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా  ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మరి.. చరణ్‌ నక్సలైట్ పాత్రలో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *