తెర వెనక హీరోలు స్టంట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమరామెన్, ఎడిటింగ్
స్టంట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, కెమరామెన్, ఎడిటింగ్
సినిమా అనగానే మనకు హీరో,హీరోయిన్, ఇతర నటీనటులు మాత్రమే గుర్తొస్తారు. కానీ సినిమా షూటింగ్ కి ముందు కొబ్బరి కాయ కొట్టింది మొదలు షూటింగ్ పూర్తయి గుమ్మడి కాయ కొట్టేంతవరకు ఎంతో మంది పని చేస్తారు. కచ్చితంగా చెప్పాలంటే 24 క్రాఫ్ట్స్ ( విభాగాలు ) సమిష్టి కృషి తోనే సినిమా నిర్మాణం జరుగుతుంది.
ఈ విభాగాల్లోని అనేక మంది పనివారు, సాంకేతిక నిపుణులు పని చేస్తేనే దర్శకుడు యాక్షన్ చెప్తాడు. నటులు నటిస్తారు. సినిమా నిర్మాణం జరిగి విడుదల అవుతుంది. 24 క్రాఫ్ట్స్ లో వుండే వ్యక్తులు, విభాగాల పని తీరు క్రింది విధంగా ఉంటుంది. ఈ 24 క్రాఫ్ట్స్ దేనికవే ప్రత్యేకమైనవి. అలాగే అన్ని సమానమైనవే.
1. స్టంట్ డైరెక్టర్లు :- పోరాటాలు కమర్షియల్ చిత్రాలకు ప్రాణం. తమ హీరో చెలరేగి పోయి వీరోచితంగా ఫైట్స్ చేస్తుంటే అభిమానుల ఆనందం వర్ణనాతీతం. వీటిని స్టంట్ మాస్టర్ లేదా స్టంట్ డైరెక్టర్లు కంపోజ్ చేస్తారు.వీరు చెప్పినట్లుగా హీరోలు యాక్షన్ సీన్స్ చేస్తారు. స్టంట్ ఆర్టిస్టులు విలన్ మనుషుల్లా నటిస్తారు.వీరు ప్రమాదకర సీన్స్ లో హీరోలకు డూపులుగా పని చేస్తారు.
పీటర్ హెయిన్ ( బాహుబలి, రుద్రమదేవి , మన్యంపులి ) రామ్ లక్ష్మణ్ ( రైడ్ ,ఢీ , ఆంధ్రుడు, ఒక్కడు ) విజయన్ ( పోకిరి, చిరుత , సైరా నరసింహారెడ్డి ) స్టన్ శివ ( శివాజీ, యమదొంగ ), థ్రిల్లర్ మంజు లు ( పోలీస్ స్టోరి, నా పేరు రాజా ) ప్రస్తుతం ముఖ్య మైన స్టంట్ డైరెక్టర్లు.
2. ఆర్ట్ డైరెక్టర్ :- చిత్ర కథకు తగ్గట్టు సెట్టింగ్స్ వేయటం కళా దర్శకుడి పని. రాజ సౌధం, మాములు ఇల్లు, పూరి గుడిసె, మార్కెట్, బస్టాండ్, రైల్వేస్టేషన్ .. . ఇలా ఏదైనా సరే ఆర్ట్ డైరెక్టర్లు సెట్ వేసేస్తారు. అవన్నీ నిజమైనవే అనిపించేలా సెట్స్ వేయటం వారి ప్రతిభకు నిదర్శనం. ఆ సెట్ చిత్రంలో ఒక భాగమై ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. నేడు తెలుగులో సాబ్ సిరిల్ ( బాహుబలి, లింగ , రోబో ) తోట తరణి ( అతడు, అర్జున్, రుద్రమదేవి ) రవీందర్ రెడ్డి ( మగధీర, ఈగ ) ఆనందసాయి ( సింహాద్రి, బద్రీనాథ్ ) అశోక్ ( ఒక్కడు, అరుంధతి ) సాహి సురేష్ ( కంచె, కార్తికేయ ) ప్రముఖ కళా దర్శకులు.
3. కెమెరామెన్ :- ఏ చిత్రానికైనా సినిమాటోగ్రఫీ ఎంతో కీలకం. మంచి స్క్రిప్ట్ , అనుభవజ్ఞుడైన దర్శకుడు ఉన్నప్పటికీ చిత్రీకరణ సరిగ్గా లేకపోతే ప్రేక్షకుడు అసంతృప్తి గా ఫీలవుతాడు.దర్శకత్వం తర్వాత అత్యంత ప్రధానమైనది ఈ విభాగమే. కెమెరామెన్ సన్నివేశాన్ని దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా చిత్రీకరిస్తాడు. వీరికి యాక్టర్స్ ను అందంగా లేదా అంద విహీనంగా చూపించట చిటికలో పని. వీరు కెమెరా తో నటుల నటనను కళాత్మకంగా ఒడిసి పడతారు. కథ బాగోకపోయిన , దర్శకత్వం నాసి రకంగా వున్నా కేవలం ఫోటోగ్రఫీ వల్లే హిట్ అయిన చిత్రాలు అనేకం వున్నాయి. గతంలో మార్కస్ బార్ట్లే ( మాయాబజార్ , గుండమ్మకథ, పాతాళభైరవి ) ప్రస్తుతం కె కె సెంధల్ కుమార్ ( సై , ఈగ , బాహుబలి ) రత్నాకర్ ( రోబో , రంగస్థలం, సైరా, సరిలేరు నీకెవ్వరూ ) చోట కె. నాయుడు ( డాడీ, జానీ, జైలవకుశ ) తదితరులు ప్రముఖ కెమెరామెన్లు.
4. ఎడిటింగ్ :- ఒక సినిమా కు ఎడిటర్ తొలి ప్రేక్షకుడు. కెమెరాతో తీసిన చిత్రంలో అనవసరమైన భాగాలు తొలగించేవాడు ఎడిటర్. సహజంగా దర్శకులు ఒక సన్నివేశానికి అనేక షాట్లు తీస్తుంటారు. వీటిల్లోంచి అవసరమైన షాట్ ను ఫైనల్ అవుట్ పుట్ గా తీయడమే ఎడిటర్ పని. చిత్రం నిడివి పెరగాలన్నా తగ్గాలన్నా అది వీరి చేతిలో పని. ఫిల్మ్ ఎడిటింగ్ చేశాక రష్ చూసి దర్శకుడు అవసరమనుకుంటే కొన్ని సీన్లు రీషూట్ చేయటం సహజం. ఎడిటర్ ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చోని కథ వినకుండా , స్క్రిప్ట్ చూడకుండా ఆ చిత్రం హిట్టా ప్లోప్పా చెప్పగలడు. కోటగిరి వెంకటేశ్వరరావు ( ఛత్రపతి, విక్రమార్కుడు, సింహ ) మార్తాండ్ కే .వెంకటేష్ ( శివమణి, ఆర్య, బిల్లా ) గౌతంరాజు ( గబ్బర్ సింగ్, మిరపకాయ్, డిక్టేటర్ ) లు ప్రముఖ ఫిలిం ఎడిటర్లు.
– సూదా శివరామకృష్ణ