మహేష్‌ బాబు ప్రాజెక్ట్‌ నుండి తమన్‌ తప్పుకుంటున్నాడా..?

Cinema

మహేష్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మొదలయిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ.. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక కారణంతో షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. మొదటగా ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ సినిమా అంటూ కేజీఎఫ్‌ సినిమాకి పని చేసిన స్టంట్‌ మాస్టర్లని సెట్‌ చేశారు. కొద్దిగా షూటింగ్‌ జరిగిన తర్వాత వారి పని మహేష్‌కి నచ్చక పోవడంతో వారిని తీసివేసారు. ఆ తర్వాత హీరోయిన్‌ గా ప్రకటించిన పూజా హెగ్దేని సైతం తప్పిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

కొద్ది రోజుల నుండి మహేష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ మధ్య విభేధాలు వచ్చాయని, గుంటూరు కారం ప్రాజెక్ట్‌ నుండి తమన్‌ని తప్పించి అతని స్థానంలో జివి ప్రకాష్ కుమార్‌ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇదే టాపిక్‌పై పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మహేష్‌ బాబుతో థమన్‌ విభేదాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో విసిగి పోయిన తమన్‌ ట్వీట్‌ తో తన అసహనాన్ని ప్రదర్శించాడు. “నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్‌ను ప్రారంభిస్తున్నాను. ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడుతుంటే వారందరికీ స్వాగతం.. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి నా సమయాన్ని వృథా చేయకండి.. నాకు చాలా పనులు ఉన్నాయి.. ‘ అంటూ ట్వీట్‌ తో కౌంటర్‌ ఇచ్చాడు. అయితే నిజంగానే మహేష్‌ బాబుతో తనకి విభేధాలు ఉన్నాయా..? గుంటూరు కారం ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడా.. లేక ఇవన్నీ ఫేక్‌ వార్తలేనా అన్న విషయాలకి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు తమన్‌. అయితే ఆయన చేసిన ట్వీట్‌ని బట్టి ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేస్తున్నట్లుగా కనిపిస్తుంది. – Santosh Krishna