ఒకప్పటి ఆంధ్రప్రదేష్ రాష్ట్రానికి, ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ ఎంతో చరిత్ర ఉంది. నిజాం పాలనలో హైదరాబాద్ నగరం వెలిగిపోయింది. ఈ ప్రపంచంలో మౌళిక సదుపాయాలతో కూడిన అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. సంపద సృష్టికి ఎంతో అనుకూలమైన నగరం. ఈ నగరాన్ని భాగ్య నగరం అని కూడా పిలుస్తారు.
హైదరాబాద్‌లో పురాతనమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన కట్టడం చార్మినార్ హైదరాబాద్‌కే ప్రత్యేకత తీసుకువచ్చింది. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఈ చార్మినార్ ఖ్యాతి గడించింది. 1591లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు ఛార్మినార్ ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్ ను పాలించిన మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి ఛార్మినార్ నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ఇక మరో పర్యాటక ప్రదేశం గోల్కొండ కోట. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోటను భారతదేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా చెబుతారు. ఈ కోట ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది చప్పట్ల ప్రదేశం. కోట ముఖద్వారం వద్ద ఉండే గోపురం కింద చప్పట్లు కొడితే ఆ శబ్ధం కోట పై భాగంలో కిలోమీటరు దూరం వరకూ వినిపిస్తుంది.
మరో ముఖ్య పర్యాటక ప్రదేశం బిర్లా మందిర్. వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయం నగరంలోని ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. బిర్లా మందిర్ యొక్క నిర్మాణ శైలి ఉత్తర, దక్షిణ భారతీయ రీతుల్లో ఉంటుంది. ఆలయం యొక్క గర్భగుడి విమాన గోపురం పూరీలోని జగన్నాధ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. 280 అడుగుల ఎత్తైన కొండపై రెండు వేల టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయ్యింది.
ఇక మరో ప్రముఖ పర్యాటక ప్రదేశం సాలార్ జంగ్ మ్యూజియం. ఈ మ్యూజియంలోని పురాతన వస్తువులు నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ III చేత సేకరించబడ్డాయి. పాలరాతి శిల్పాలు, ఏనుగు దంతాల కళాకృతులతో పాటు పర్షియా, ఈజిప్ట్, ఉత్తర అమెరికా, ఐరోపా, చైనా, బర్మా, నేపాల్, జపాన్ వంటి దేశాలకు సంబంధించిన లోహ కళాఖండాలు, తివాచీలు, సెరామిక్స్, బొమ్మలు, శిల్పాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి పరంగా పరిశ్రమలు, ఉపాధి కల్పనలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది.